మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభ ముగిసిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. త్వరలోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. తాను ఎవరికీ వ్యతిరేకిని కాదని, రైతు పక్షపాతినని కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోనూ తెలంగాణ పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ ను ఆదరించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తామని చెప్పారు.
ఎలాంటి వనరులు లేని సింగపూర్, మలేసియా వంటి దేశాలు అద్భుతాలు చేస్తుంటే, భారత్ మాత్రం ఎక్కడిదక్కడే ఉందని అన్నారు. దేశంలో అపార సహజ సంపద ఉన్నా అది జనానికి చేరువ కావడంలేదని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలు దాటినా ట్రైబ్యునళ్లు దేశంలోని జలవివాదాలను ఎందుకు పరిష్కరించడంలేదు? దేశంలో ఎందుకు జల యుద్ధాలు జరుగుతున్నాయి? మహానది, గోదావరి, కావేరి నీళ్ల కోసం పంచాయితీలు ఎందుకు? రాష్ట్రాల మధ్య ఎందుకు నీటి చిచ్చు పెడుతున్నారు? అని ప్రశ్నించారు.
భారత్ విశాలమైన దేశం అని, జల వనరుల విషయంలో బీఆర్ఎస్ కు స్పష్టమైన ప్రణాళిక ఉందని వివరించారు. దేశంలో జల విధానం సమూలంగా మార్చాల్సి ఉందని అన్నారు. 75 వసంతాల స్వతంత్ర భారతావనిలో దేశ రాజధాని ఢిల్లీలో నీటి లభ్యత సరిగా లేకపోవడంపై ఏమనాలి? అని వ్యాఖ్యానించారు. దేశంలో అంత గొప్ప విధానాలు ఉంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. యువత, మేధావులు, ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. రోడ్లు సరిగా లేవు, రైళ్లు సరిగా లేవు, షిప్ యార్డులు సరిగా లేవని విమర్శించారు. భారత్ లో గూడ్స్ ట్రైన్ ఎంత వేగంతో వెళుతుందో పరిశీలించండి… ఆ విధంగా వెళితే అభివృద్ధి అనే గమ్యాన్ని ఎప్పుడు చేరుకుంటాం? మిగతా ప్రపంచంతో పోటీపడగలమా? అని పేర్కొన్నారు.
భారత్ లో గూడ్స్ రైలు సగటు వేగం గంటకు 24 కిలోమీటర్లు అని, అదే చైనాలో గూడ్స్ రైలు సగటు వేగం గంటకు 120 కిలోమీటర్లు అని కేసీఆర్ వెల్లడించారు. ఈ విధంగా అయితే చైనాతో ఎప్పటికైనా పోటీపడగలమా? అని సందేహం వ్యక్తం చేశారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీలోనూ గూడ్స్ రైళ్ల సగటు వేగం భారత్ కంటే ఎక్కువని వివరించారు. దేశంలోని ట్రక్ స్పీడ్ కూడా ఇతర దేశాల కంటే తక్కువని అన్నారు. ఇలాంటివి పట్టించుకోకుండా విభజన రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తే దేశం ఎలా ముందుకు పోతుందని అన్నారు.
చిత్తశుద్ధి ఉంటే దేశమంతా రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వొచ్చని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. “అదానీ, అంబానీ, జిందాల్ లకు ఎందుకు ఇస్తున్నారు? పవర్ సెక్టార్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే దేశాన్నే బ్లాక్ మెయిల్ చేస్తారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తాం… రెండేళ్లలోనే దేశం వెలిగిపోయేలా చేస్తాం. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువస్తాం” అని స్పష్టం చేశారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కేంద్రం విఫలమైందని విమర్శించారు. ప్రైవేటీకరించిన ఎల్ఐసీని మళ్లీ ప్రభుత్వ పరం చేస్తామని వెల్లడించారు. “అదానీ స్కామ్ పై జేపీసీ ఎందుకు వేయడంలేదు? అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ నుంచి రూ.87 వేల కోట్ల పెట్టుబడులు పెట్టించారు. అదానీ ఎఫెక్ట్ తో ప్రజల సొమ్ము రూ.10 లక్షల కోట్లు ఆవిరైంది. అదానీ మిత్రుడు కాబట్టే అతడ్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్ఐసీకి ఎలాంటి నష్టం జరగలేదని కేంద్ర ప్రభుత్వం ఎలా చెబుతుంది? అసలు, అదానీ ఇంత వేగంగా ఎదగడం ఎలా సాధ్యమైంది?సాధారణ వ్యాపారికి ఇది సాధ్యమవుతుందా?” అంటూ కేసీఆర్ కేంద్రంపై ధ్వజమెత్తారు.