బీజేపీ వర్సెస్ బీఆర్ ఎస్ మధ్య పొలిటికల్ వార్

బీజేపీ వర్సెస్ బీఆర్ ఎస్ మధ్య పొలిటికల్ వార్

అవినీతి ఆరోపణలపై ఆలోచిస్తున్న ప్రజలు

తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ ‘వార్’ జరుగుతుంది. రాజకీయ లబ్దికోసం బీజేపీ వర్సెస్ బీఆర్ ఎస్ ల మధ్య చలికాలంలో వేడి వేడిగా అవినీతి ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపి, వైఎస్ ఆర్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం లు కూడా పొలిటికల్ జెండాలను ఎత్తి స్వంత ఎజెండాలతో రాజకీయ లబ్దికోసం ఎవరికి వారే అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలనకు శరమగీతం పాడాలని బీజేపీ, కాంగ్రెస్, బిఎస్ పి, టీడీపి ఉద్యమాలను చేస్తోంది.

సీఎం సీటు కోసం సై అంటే సైసై…

రాబోయే కాలంలో ‘సీఎం సీటు’ లక్ష్యంగా బీజేపీ వర్సెస్ బీఆర్ ఎస్  పొలిటికల్ పార్టీలు సై అంటే సైసై అంటూ ప్రజల ముందుకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని బీజేపీ, కాంగ్రెస్, బిఎస్పిీ, టీడీపీ, టీఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అవినీతి ఆరోపణలు సందిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుల మధ్య  ఆరోపణల ఎదురు దాడులతో ఎప్పుడు రాజకీయాలు ఎటు మారుతాయో అంటున్నారు విశ్లేషకులు. గ్రామీణ ప్రాంతాలలో బీజేపీని పటిష్టం చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాద యాత్రలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనంగా బీఆర్ ఎస్ ధర్నాలు చేస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, తెలంగాణ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రలు నిర్వహిస్తున్నారు.

అవినీతి బహిర్గతం – ఆలోచిస్తున్న ప్రజలు

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల పక్షపాత వైఖరితో చూస్తూ నిధుల కెటాయింపులో అన్యాయం చేస్తుందని బీఆర్ ఎస్ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. రైతుల సమస్యల చుట్టూ బీజేపీ, బీఆర్ ఎస్ రాజకీయాలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రెండు పార్టీలు చేసుకుంటున్న అవినీతి ఆరోపణలతో ప్రజలకు పాలకుల నిజ స్వరూపం తెలుస్తోంది. రైతుల సంక్షేమం, అభివృద్ది పట్ల ఈ రెండు పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు ప్రతి పక్షలు.

ఎమ్మెల్యేల కొనుగోలుతో బీఆర్ ఎస్..

మద్యం స్కాంతో బీజేపీ రెండు పార్టీలు ఢీ అంటే.. ఢీ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సెంటిమెంట్ తో రెండవ సారి కూడా సీఎం సీటును కైవసం చేసుకున్న బీఆర్ ఎస్.. కేంద్రంలో కూడా రెండవ సారి అధికారంలోకి వచ్చిన బీజేపీల మధ్య మొదట మంచి సయోధ్య ఉండేది.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి మద్దతు ఇచ్చింది బీఆర్ ఎస్.  దేశంలో ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను అభినందిస్తూ మద్దతు ఇచ్చారు సీఎం కేసీఆర్.  నోట్ల రద్దు, జీఎస్టి అమలు పట్ల అసెంబ్లీ సాక్షిగా ప్రధాని మోదీని కేసీఆర్ బల్లగుద్ది బలపర్చారు. అయితే.. బీజేపీ-బీఆర్ ఎస్ రెండు అంతర్గతంగా ఒప్పందంతోనే పరస్పరం మద్దతు ఇచ్చుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపణలు చేసింది.

దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని..

వ్యవసాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలపై సీఎం కేసీఆర్ మొదట మద్దతు ప్రకటించారు. ఉత్తర భారత దేశ రైతాంగం ఈ చట్టాలపై కన్నెర్ర చేయడంతో సీఎం కేసీఆర్ యు టర్న్ తీసుకున్నారు. దేశ ప్రధాని మోడి రైతాంగ వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకున్నారని బహిరంగంగా రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించడంతో బీజేపీతో సంబంధం చెడినట్లు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లితే రాష్ట్రంలో తన తనయుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానలు వినిపించాయి.

ఎవరు తవ్వుకున్న బొందలో వారే పడుతారు..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గంతో ఒప్పందం చేసుకున్న కేసీఆర్ ఆ తరువాత మాట తప్పారు. తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రత్యర్థులు ఉండకూడదనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్, టీడీపి ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ లో విలీనం చేయించుకున్నారు. కాంగ్రెస్, టీడీపి పార్టీలను రాజకీయంగా భూస్థాపితం చేస్తానని విర్రవీగిన కేసీఆర్ కు ప్రస్తుతం బీజేపీ ప్రత్యర్థిగా మారింది. చాప కింద నీరులా బీజేపీ బలపడటంతో ఇప్పుడు కేసీఆర్ కు రాజకీయ ప్రత్యర్థి బీజేపీ మాత్రమే కనిపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో విలీనం చేసుకున్న కేసీఆర్ తాను తవ్వుకున్న బొందాలో అతనే పడ్డాడు అంటున్నారు విశ్లేషకులు.

అవకాశం దొరికితే…

రాజకీయంగా లబ్ది పొందాలంటే పరిస్థితులను అనుకులంగా మలుచుకోవడం రాజనీతి. ఇప్పుడు బీజేపీ-బీఆర్ ఎస్ చేస్తున్న పనులు ఇవే. సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్యం లిక్కర్ స్కాంలో ఇరుక్కుందని సీబీఐ – ఈడీలతో ఒత్తిడి చేస్తుంటే, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ పట్టుబడ్డారని బీజేపీపై ఎదురు దాడులు చేస్తున్నారు బీఆర్ ఎస్ నాయకులు. అవినీతి రాజకీయాలతో బీజేపీ-బీఆర్ ఎస్ రెండు పార్టీలు రాజకీయంగా లాభ పడటానికి యత్నిస్తుంటున్నారు రాజకీయ పండితులు.

ముగింపు..

మరో ఏడాదిలో కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో తెలంగాణ రాజకీయాలు అసక్తిగా మారుతున్నాయి. రాబోయే కాలంలో కాబోయే సీఎం ఎవరనే చర్చ ఇప్పటి నుంచే ప్రారంభమైంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తామే బీఆర్ ఎస్ కు ప్రత్యార్థులమని చెబుతుంటే తాము తక్కువ కామని చెబుతున్నారు టీడీపీ.

  • మారబోయిన మాన్విక్ రుద్ర
BJP x BRS Political war/ BRS / BJP /
Comments (0)
Add Comment