Bird life is very Happy
పిట్ట బతుకు ఎంతో హాయి
ఓ పుల్లా, ఓ పుడక, ఎండుగడ్డి, సిన్నకొమ్మ
సిట్టిగూడు పిట్ట బతుకే ఎంత హాయి
సిగురుటాకు వగరుపూత లేతపిందె తీపిపండో
నోటికంది సింతలేక కునుకుతీసే పక్షి బతుకే స్వర్గమాయి
పూటకుంటే అంతేసాలు రేపు ఎట్లన ధ్యాస లేదు
లోభితనం ఎరుక లేదు దాసుకునెటి గుణం లేదు
నరులకున్న ఈర్ష లేదు మనసులో ఏ మాయ లేదు
సీకటయితే వొదిగిపోయి వేకువనె నిదుర లేసి
గాలిలోన ఈదుకుంటు గగనమంచుల తడుముకుంటు
కొండకోనల దాటుకుంటు కొమ్మరెమ్మల కొలువుదీరె
గోరువంక రామసిలుక పావురాయి పాలపిట్ట
నరుడు పెట్టిన పేర్లు తప్ప తనకు ఊరు పేరు లేదు
ఊరు పేరు ఉనికి కోసం ఈసమంత ఆరాటం లేదు
Bird life is very Happy
సదువు నేర్పె సాలె లేదు దారిజూపే గురువు లేదు
ఎండ వానకు గొడుగు లేదు వణుకు పుడితే వుడుకులేదు
అన్ని ఉన్నాయన్న నరుడు ఆశలోభం వెంటాడంగ
ఏది లేని పిట్ట చెంతకు జేరి జాతకం అడుగుతున్నడు
– గోరటి ఎంకన్న
(సుప్రసిద్ధ జానపద కవి)