ఇగో గీ బతుకమ్మ పాట ఆట జూసిండ్రా..గియ్యల్లా బతుకమ్మ పండుగని తెలంగాణంతా ఇంటింటికి బతుకమ్మ దీసిండ్రు. ప్రకృతి పండుగని తీరొక్క పూవ్వుతోటి బతుకమ్మ పేరిచ్చి రంగులు అద్ది మత్తు గమ్మతుగా ముస్తాబు చేసిండ్రు.. పని మీద ఇంటి నుంచి బయటకు పోతే యాడ జూసిన మన అమ్మలక్కలు.. పిల్లలే కాదు ముసలోళ్లు కూడా మస్తు తయారై గీ బతుకమ్మలు చేతిలో పట్టుకుని పోయిండ్రు.. పల్లెటూర్ లలోనైతే చెరువుల్లోనో.. బాయిలల్లోనో.. ఏది లేదంటే కాలువల్లో బతుకమ్మను వదిలి పోయిరా.. బతుకమ్మ అంటూ దండం పెడుతారు..
మరీ.. గీ హైదరాబాద్ లో నైతే గట్ల చెరువులుండవ్ గదా.. మరీ గీళ్లు గా బతుకమ్మలను యాడ నిమజ్జనం చేస్తారనుకుంటుండ్రా..? ఇగో నేను కూడా గా సంగతి తెలుసుకుందామని కొంపల్లిలోని పంచశీల కాలోని కమ్యూనిటి హాల్ కు పోయిన. గాడ బతుకమ్మలను నడిమిట్ల పెట్టి డిజె లో పాటలు జోర్డార్ పెట్టుకుని ఆడోళ్లంతా ధూం..ధాం.. డ్యాన్స్ లు చేస్తుండ్రు.. వాళ్లు పాటల దగ్గట్టు ‘‘బతుకమ్మ’’ స్టెప్పులేసిండ్రు. ఇగో గాళ్లంతా బతుకమ్మ కాడా డ్యాన్స్ లు చేస్తుంటే పక్క రోడ్ పోంటి పోయెటోళ్లంతా నీలబడి చూసి మురిసి పోయిండ్రు. Batukamma-Boddemma festival
గమ్మత్తెందంటే గా బతుకమ్మలు పేరిచ్చుకుని యాభై మందికి పైగానే వచ్చుంటారు. పంచశీల అభివృద్ది కమిటీ పెద్దలు రవీంద్ర నాయుడు, శ్రీనివాస్ రెడ్డి, బతుకమ్మ పండుగను మత్తు మంచిగా చేయాలని అన్నీ ఏర్పాట్లు వీళ్లే చూసుకున్నారు. అయితే.. లక్ష్మీ, మాధవి, సుకన్య, ప్రియాంక గీ నలుగురు మత్తు రోజుల ముందు నుంచే కాలోనిలోని ఆడోళ్లకు దాండియా ట్రైనింగ్ ఇప్పించిండ్రు. ఇగో.. గీయ్యళ్ల బతుకమ్మ పండుగ రోజు రెండు గంటలు ధూం.. ధాం.. పాటలు.. డ్యాన్స్ లకు ఆడోళ్లంతా స్టెప్పులు భలే వేసిండ్రు. సినిమా సాంగ్స్ కు బతుకమ్మ స్టైల్ లోనే రెండు చేతులతో చప్పట్లు కొడుతూ బతుకమ్మల చుట్టూ తిరిగిండ్రు. ఒకరికొకరు మొఖాలకు పసుపు కుంకు రాసుకుండ్రు. Batukamma-Boddemma festival
ఇగ ఇంటింటి నుంచి తెచ్చిన బతుకమ్మలను వేయడానికి పెద్ద ట్యాంక్ ఏర్పాటు చేయించిండ్రు. గా బతుకమ్మలను గా నీళ్లల్లో వేసినంక ఇంటి కాడి నుంచి తెచ్చిన సద్దాన్నం ఒకరికొకరు వడ్డించుకుని తిన్నారు. ఇగో గీ బతుకమ్మ గురించి గిప్పటి ఆడ పిల్లలకు తెలియదు గదా.. పెద్దోళ్లను బతుకమ్మ గురించి అడిగితే గాళ్లు ఓపికతో చెప్పిండ్రు. తంగేడు, గునుగు, కట్ల, రుద్రాక్షలతో బతుకమ్మలను తయారు చేస్తారన్నారు. ఇది ఆడ పిల్లల పండుగ.. ఏడాదికొకసారి వచ్చే గీ పండుగంటే ప్రతి ఆడ పిల్లకు ప్రాణం.. అత్తింటి వారింట్లో ఉండే ఆడ పిల్లలను పుట్టింటికి తీసుకచ్చేది గీ బతుకమ్మ పండుగ. గణపతుల పండుగ తరువాత అనంత చతుర్ధశి తర్వాత వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మల పున్నమంటారు. ఒక్కో ఏరియాలో ఒక రకంగా గీ పండుగను చేసుకుంటారు. బతుకమ్యను బొడ్డెమ్మ అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు ఎర్రమన్నుతో అలికి ముగ్గులు వేసి పూలతో అలంకరిస్తారు. ప్రతిరోజు అక్కడికి వచ్చే పిల్లలు ఏ ధాన్యమో తెచ్చి బొడ్డెమ్మ మీది కలశంలో పోస్తారు. ఆట ముగిసిన తర్వాత-. ‘‘నిద్రపో బొడ్డెమ్మా నిద్రపోవమ్మ – నిద్రాకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు / నినుగన్న తల్లికి నిండునూరేండ్లు – పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేండ్లు’’ అంటూ నిద్రపుచ్చుతారు. ఇగో గీ బతుకమ్మ చరిత్ర ముచ్చట ఎంత చెప్పిన ఒడువదని చెప్పిండ్రు గా తల్లులు..