balu : బాలు నిను మరువలేం
ఏడీ .. గాన గంధర్వుడు..? ఇక కనరాడా..? కంట తడిపెట్టిన ‘పాట’ పల్లవి, చరణాల్ని అనాథలు చేసి వెళ్ళిన ‘పాట’ ! శృతి లేని పాట..గతి తప్పిన గాత్రం..! ప్రకృతి విలయాన్ని ఎవరాపగలరు..? గానం.. ధ్యానం.. సాహిత్యం ఆయన ప్రాణం..!! సంగీత గగనంలో చందమామ అతడు.. అందరి నోళ్ళలో నానే ‘మధుర గాయకుడు.’ కరోనా కాటుకు..‘పాట’ బలి !! బాలు లేని పాట..పందిరి లేని తీగ.! బాలు లేని పాట..పల్లవి లేని పాట.! బాలు లేనిదే లలిత సంగీతం లేనే లేదు.! ఆ పాట లేక జగమంత కుటుంబం తట్టుకునేదెలా?
‘బాలు’ అంటూ మనం రోజూ నోరారా పిలుచుకునే ‘శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం’ (ఎస్పీ) బాలసుబ్రహ్మణ్యం.(SP Bala Subrahmanyam) ఒకటా రెండా? వివిధ భాషల్లో నలభై వేలకు పైగా పాటలు.. 70 ఏళ్ళు దాటినా మాధుర్యం తగ్గని గళం ఆయనది. ఆయన గాత్రం అమరం. ఆయన పాట అజరామరం. ఆయన గొంతు రస గంగ. ఒక్క మాటలో చెప్పాలంటే ..‘పాట’కు ఆయననిలువెత్తు రూపం.
బాల్యం నుంచి పాటంటే బాలుకు ఎంతో ఇష్టం. తండ్రి త్యాగరాజ కీర్తనలు ఆలాపన బాలుకు వారసత్వంగా సంక్రమించింది. నూనూగు మీసాల వయసులోనే పాటను మచ్చిక చేసుకున్నాడు. అయినా.. అవకాశాలు మాత్రం అంత ఈజీగా రాలేదు. నెల్లూరు నుంచి మద్రాసుకు చేరుకొని అవకాశాల కోసం ప్రయత్నించాడు. కాలం కలిసి రాలేదు. అయినా.. నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాడు. పదిమందిలో ఒకడిగా కోరస్ పాడాడు. కొందరు గాయకులకు డమ్మీగా పాడాడు. డబ్బింగ్ చిత్రాల్లో పాడాడు.
చివరకు సంగీత దర్శకుడు ఎస్.పి కోదండపాణి సహకారంతో పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్నలో తొలి పాట పాడాడు. అప్పటికి గొంతులో లేతదనం ఇంకా తగ్గలేదు. ఘంటసాల వారి ప్రభ వెలిగిపోతోంది. ఆ టైంలో బాలు మరికొంత కాలం వేచి ఉండక తప్ప లేదు. ఆ తర్వాత బాలుపై నమ్మకంతో కోదండపాణి మళ్లీ అవకాశం ఇచ్చారు. బాలు వాటిని సద్విని యోగం చేసుకున్నారు. అలా.. బాలు గొంతు విచ్చుకుంటూ నిలదొక్కుకోసాగింది. కృష్ణ గారికి బాలు గొంతు నప్పడంతో బాలు ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నటుడు కృష్ణకు పాడిన.. ‘గుంతలకిడి బొమ్మ’ పాట ఆరోజుల్లో అందరి నోళ్లలో నానడం నాకింకా గుర్తుంది.
బహుముఖ ప్రతిభ..!
బాలు కేవలం బహు భాషా గాయకుడేకాదు. నటుడు కూడా.. చిత్ర నిర్మాత. రచయిత, సంగీత దర్శకత్వం, డబ్బింగ్, మిమిక్రీ ఆర్టిస్ట్.. సామాజిక సేవకుడు. ఇలా ఎన్నో రూపాల్లో, ఎన్నో.. పాత్రల్లో ఒదిగి పోయి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఈటీవి’లో పాడుతాతీయగా కార్యక్రమ నిర్వహణ ద్వారా ఎందరో కొత్తగాయకులను తెరపైకి తెచ్చిన ఘనత తక్కువేం.. కాదు.. అసలు ‘బాలు ఇకలేడు’.. అన్న వార్త విని పాట గుండె బద్దలు కాకుండా ఉండగలరా? భాష, ప్రాంతీయ, భేదం లేకుండా మన దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం ఉన్న అసంఖ్యాక అభిమానులు ఎలా తట్టుకుంటారు. అసలు ఈ నిజాన్ని ఎలా జీర్ణంచుకుంటారు.?
చరిత్రను తిరగరాసిన బాలు..
ఆరోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మహానటులకు ఘంటసాల మాస్టారు వారి గొంతుమాత్రమే నప్పేది. అలాంటి పరిస్థితుల్లో ఘంటసాల గారి మరణం పాటకు పెద్ద లోటైంది. అప్పుడు రామకృష్ణ అనే గాయకుడిని ట్రై చేశారు.. అయితే ఆయన ఎక్కువ కాలం నిలదొక్కు కో లేకపోయారు. అలాంటి క్లిష్ట, కష్ట పరిస్థితుల్లో బాలు తన గొంతును మార్చుకుని పాటలు పాడి ఆ లోటును తీర్చారు. సహజంగా మిమిక్రీ ఆర్టిస్ట్ కావడం వల్ల .. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ శరీరభాషకు, హావభావాలకు, వాచకానికి సరిగ్గా అతికేట్లు పాడడం మొదలు పెట్టారు. అలా ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు పర్మినెంట్ గాయకుడయ్యారు. పరిస్థితుల్ని తనకుఅనుకూలంగా మలుచుకోడానికి తన గళాన్ని ఓ ప్రయోగశాలగా మార్చుకున్నాడు. కొత్త ప్రయోగాలు చేసి విజయం సాధించారు బాలు.
ఒకే సినిమా ( సత్యం శివం )లో ఒకే పాటలో ఏఎన్నార్, ఎన్టీఆర్లకు గొంతు మార్చి పాడారు. అలాగే కృష్ణార్జునులు సినిమాలో శోభన్ బాబు, కృష్ణకు ఒకేపాటలో ఇద్దరికీ గొంతు మార్చి పాడి ఆశ్చర్యంలో ముంచెత్తడం బాలు గారికే చెల్లింది. రాజబాబు, అల్లు రామలింగయ్యలకు పాడినప్పుడు వాళ్లే పాడుతున్నారా? అన్నట్లు వాళ్ల గొంతుతో పాడి శభాష్ అనిపించుకున్నారు.
డబ్బింగ్ అయినా.. పాట అయినా అదే కమిట్మెంట్
బాలు యేం చేసినా కూడా మనసు పెట్టి చేస్తారు. పాట పాడినా.. డబ్బింగ్ చెప్పినా అంకిత భావం మాత్రం ఒకటే.. అందుకే అన్నమయ్యలో సుమన్ కు డబ్బింగ్ చెప్పినందుకు బాలుకు రాష్ట్ర ప్రభుత్వ నుంచి బంగారు నంది బహుమతి వచ్చింది. ఇదే కాదు.. ఆయన ఎన్నో బంగారు నందుల్ని తన ఇంట్లో కట్టేసుకున్నాడు.
తెలుగునాటే కాదు.. భాష ఏదైనా
తెలుగునాట మాత్రమమే కాదు పొరుగున ఉన్న తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా బాలు తనదైన ముద్ర వేశారు. తమిళనాట ఎం.ఎస్ విశ్వనాథన్ వంటి గొప్ప సంగీత దర్శకులు బాలులోని సహజ ప్రతిభను గుర్తించి.. అతి క్లిష్టమైన పాటల్ని కూడా బాలు గొంతులో అలవోకగా పాడించారు. అంతులేనికథ, కోకిలమ్మ, వయసు పిలిచింది, ఆకలి రాజ్యం, సొమ్మొకడిది.. సోకొకడిది, విచిత్ర సోదరులు వంటి సినిమాల్లో విశ్వనాథన్ గారు బాలు చేత అనేక ప్రయోగాలు చేయించి.. సూపర్ హిట్ పాటల్ని పాడించారు.
‘రసం’ ఏదైనా…
‘రసం’ ఏదైనా.. ఆ గొంతులో అలా అవలీలగా అమరాల్సిందే. అది ఆవేశం కావచ్చు.. వీర రసం కావచ్చు.. ప్రణయం కావచ్చు.. ప్రళయం కావచ్చు. రొమాన్స్ కావచ్చు. భక్తి కావచ్చు. విషాదం కావచ్చు. హాస్యం కావచ్చు.. రసంతో నిమిత్తం లేకుండా బాలు గొంతు పరకాయ ప్రవేశం చేస్తుంది.‘ఇదే..ఇదే..రగులుతున్న అగ్నిపర్వతం..’ అంటూ ఆవేశంగాపాడినా, ‘ఇది తొలిరాత్రి’ అంటూ.. విషాదగీతం పాడినా.. హృదయాలను కొల్లగొట్టడంలో బాలు ఏమాత్రం రాజీపడడు.
సంగీత దర్శకుడెవరైనా.. అలా ఒదిగిపోయాడు బాలుకే చెల్లింది. రాజన్.. నాగేంద్ర కావచ్చు.. కె.వి మహదేవన్ కావచ్చు.. కోదండపాణి కావచ్చు.. ఏ ఆర్ రెహమాన్ కావచ్చు.. నీ నా తన తరతమ భేదాల్లేకుండా ‘బెస్ట్’ ఇవ్వడమే బాలుకు తెలిసిన ‘గాన’ విద్య.
పాటే కాదు..పద్యం కూడా.!!
పాట మాత్రమే కాదు.. తెలుగువారి కెంతో ఇష్టమైన పద్యం పాడటంతో కూడా బాలుకు బాలునే సాటి. మాయని మమత,పంతులమ్మ,మిస్టర్ పెళ్ళాం తదితర సాంఘిక చిత్రాలతో పాటు.. శ్రీకృష్ణ సత్య, శ్రీరామాంజనేయయుద్ధం, దానవీర శూర కర్ణ, కురుక్షేత్రం వంటి ఎన్నో పౌరాణిక, చారిత్రక, జానపద చిత్రాల్లో పద్యాలు పాడి మెప్పించారు బాలు.
టాలివుడ్ టు బాలివుడ్..
టాలివుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ లో కూడా బాలు జెండా ఎగురవేశారు. ఏక్ దూజేకేలియే, మైనేప్యార్ కియా, సాజన్, హమ్ ఆప్ కే హై కౌన్.. వంటి చిత్రాలు సూపర్ హిట్ కావడానికి బాలు పాటలు కూడా దోహదపడ్డాయంటే అతిశయోక్తికాదు.
ఏక్ దూజేకేలియే సినిమాకు 1981 లో ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. మైనే ప్యార్ కియాకు 1990లో ‘ఫిలింఫేర్’ అవార్డు గెలుచుకున్నారు. ఇక మిగతా అవార్డులు, పురస్కారాలకు లెక్కేలేదు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, బెంగాలి, పంజాబీ, ఒరియా, తుళు తదితర భాషల్లో బాలు పాడినా పాటలకు అనేక పురస్కారాలొచ్చాయి. పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు కూడా బాలు సొంతమయ్యాయి.
సినీ పరిశ్రమకు.. తాను సైతం..!!
సినీ పరిశ్రమకు ‘నేను సైతం’ అన్నట్లు కోదండపాణి ఆడియో లాబరేటరీ, కోదండపాణి కలర్ ల్యాబ్, కోదండపాణి ఫిలింసర్క్యూట్స్ వంటి సంస్థల్ని బాలు స్థాపించారు. అలాగే కొన్ని సినిమాలు నిర్మించారు.
ఘంటసాల ఆశీర్వాదం..
సాక్షాత్తు ఘంటసాల మాస్టరు ఆశీర్వాదం పొందడం బాలు వ్యక్తిత్వానికి మచ్చుతునక.‘నా తర్వాత నా అంతటి గాయకుడు అవుతావు నాయనా!’ అంటూ ఘంటసాల గారిచే కితాబు అందుకున్నారు. బాలు.. ఏకవీర చిత్రంలో తాను ఏకలవ్య గురువుగా భావించే ఘంటసాల గారితో కలిసి ‘ప్రతీ రాత్రి వసంత రాత్రి.. ప్రతి గాలి పైరగాలి’ అనే జుగల్ బందీ పాటను పాడి మెప్పించారు. అలాగే ఊపిరాడకుండా ఏకబిగిన పాట పాడినా శంకర్ మహదేవన్ కు సరి జోడు అన్నట్లు.. తానూ ఓ పాటపాడి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ఆయన లేకుండా వాళ్లు సినిమాలు తీయరు..
దర్శకులు విశ్వనాథ్,జంధ్యాల, బాపు, బాలచందర్, రాఘవేంద్ర రావు, దాసరి, విజయ బాపినీడు, గోపాల్, ఎస్.డి లాల్, పెద్ద వంశీ వంటి వారు బాలు లేకుండా సినిమాలు తీయమంటూ భీష్మించేవారు.
రచయిత గా..
బాలు స్వయంగా అనేక పాటలు రాసి, వాటికి సొంతంగా బాణీలు సమకూర్చి పాడారు. పడమటి సంధ్యారాగం లో ఓ ఇంగ్లీష్ పాట రాశారు. ఆ పాటకు ఆయనే స్వరాలు కూడా కూర్చారు.
కరోనా.. ఎంత దయమాలింది. మధురమైన పాటను పొట్టను పెట్టుకుంది.’కరోనా..కరోనా’..అంటూ పాట పాడినా.. కరోనా సంతృప్తి పడలేదు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన గాయకుల్ని ఆదుకునేందుకు లాక్ డౌన్ పీరియడ్‌లో ఫేస్ బుక్‌లో పాటలు పాడి ఓ సంక్షేమ నిధిని పోగు చేశారు బాలు. ఓ టీవీకి సంబంధించి 25 ఏళ్లు కార్యక్రమానికి హైదరాబాద్ కు వచ్చి 3 రోజులున్నారు. ఆ టీవీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కానీ.. అదే సమయంలో కరోనా బారిన పడ్డారు.. కుటుంబ సభ్యులు వెళ్లొద్దంటూ వారించినా, వేడుకున్నా.. ఆ టీవీ యాజమాన్యంపై ప్రేమతో.. ముందస్తు కమిట్ మెంట్‌కు కట్టుబడ్డారు. కరోనా బారిన చిక్కుకుని ఆగస్టు 5న మద్రాసు MGM ఆస్పత్రి లో చేరారు. అప్పటి నుండి అక్కడే చికిత్స పొందారు. కరోనా వల్ల ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిని ‘అంతర్యామి అలసితి సొలసితి ..ఇంతట నీ శరణంటూ’.. మనకు అందనంత దూరతీరాలకు వెళ్లిపోయారు.. బాలు గారు.!
ఎవరైనా ఒకప్పుడు వెళ్లిపోవాల్సిన వాళ్ళమే..
కానీ.. ఇలా ‘అర్థాంతరంగా…’ కరోనా మహమ్మారి బారిన పడి వెళ్లిపోవడం అభిమానులను రంపపు కోతకు గురిచేస్తోంది.ఈ బాధను భరించడమెలా ? అన్నదే ఇప్పుడు సమస్య..? బాలు..మీరు లేరని ఎవరున్నారు.? మీ పాటలు మా గుండెల్లో ఎప్పటికీ గూడు కట్టుకునే వుంటాయి. శబ్దాన్ని పాటగా మలిచి మాకోసం వదిలెళ్లిన.. బాలు గారూ.. యూ ఆర్ గ్రేట్..
బాలుకు మరణం లేదు.. ఆయన పాటకు మరపు లేదు. ఆయన సంగీత వాసి.. పాటల పిపాసి.. పాటల తోటలో వానకారు కోయిల ఆయన అని.. ఎంతగా సర్ది చెప్పుకున్నా.. బాలు లేని ‘పాట’ ను ఊహించడం కష్టమే..!!
– ఎ.రజాహుస్సేన్, రచయిత