Bahujana Bathukamma
బహుజన బతుకమ్మ
పల్లేరుగాయలున్న బాట నడిసి
సిన్గిన చీరకొంగుసాపి ఒడినిండా
అడవి అందాల పువ్వులేరుకొచ్చి
పొక్కిలైన వాకిట్ల కూసోని
ఒక్కొక్క పూవ్వుపేర్చి
సింగిడినే నేలపైకి దించుతుంది
మా బహుజనుల బత్కమ్మ.
ఎర్రమట్టిని సుద్దమన్నును గంపకెత్తుకొచ్చి
పెండనీళ్లలో మూడొద్దులు నానబెట్టి
పాడుబడిన గోడలకు అలికిపూసి
భూలోకంలోవున్న అందాలను
పర్రెలిచ్చిన గోడలకు అలికిపూస్తూ
పేదరికాన్ని కప్పిపెడ్తుంది
మా బహుజనుల బత్కమ్మ.
నూనె పూయని కొప్పున సెండుపూవ్వు
ఊగాదికి అన్నలొచ్చి తొడిగిచ్చిన గాజులు
పుట్టింటి అమ్మనాయనలు వడిబియ్యంతో
పెట్టిన సంతల చీరరైక
పనకు సూర్యుడు పొడుస్తున్నట్టు
కుంకుమ పసుపు బొట్లతో బోనమెల్లె తల్లి
మా బహుజనుల బత్కమ్మ.
ముక్కుకు యాపపుల్లనే ముక్కురాయి
చెవులకు తుమ్మముండ్లే కమ్మలు
గొంతులో నల్లపూసల దండనే పచ్చలహారం
కాళ్లకు వరకట్నంకింద ఇచ్చిన కాళ్లకడియాలు
మెట్టెలతో మెరిసిపోయే మా ఇంటి దేవత
మా బహుజనుల బత్కమ్మ.
ఇంటింటి ఆడబిడ్డలు
మాదిగ మాశన్న డప్పుసప్పులతో పయనమైతారు
పల్లె బొడ్రాయిసుట్టూ తిరిగి
నడిమధ్యలో పేర్చి
అమ్మలక్కలంత సప్పట్లతో
బొడ్డెమ్మ పాటలై ఆ రాత్రిని వెల్గిస్తారు.
నాట్లేసేకాడ నాదమై జతకట్టిన పాటలు
మోటగొట్టేకాడ మోగిన పాటలు
బండెద్దులు అల్లిస్తుంటే గొంతుదాటిన పాటలు
గొర్రుగుంటుకలు ఇత్తునమేస్తుంటే
ఒడినింపిన బాణీలు
కొండ్రేసి నాగలి దున్నుతుంటే
నాగేటి సాళ్ల వెంట నడిచిన రాగాలు
మా కూలీతల్లుల గొంతులో స్వరాలైతాయి.
కోతకోస్తుంటే కొడవలిని పదునెక్కించిన లయలు
రాశిబోసినక్క రైతన్న రాసెక్కి కూతేసిన కూతలు
మునమెల్లినప్పుడు కూలీలు తీసిన కూనీరాగాలను
బత్కమ్మలను బొడ్డేసి
బొడ్డెమ్మ పాటలతో వంతపాడుతూ
మా శ్రమించే అడబిడ్డలు
బొబ్బలెక్కిన చేతులతో సప్పట్లు కొడుతూ
చేసుకునేది
మా బహుజనుల బత్కమ్మ.
అవనిశ్రీ, కవి సెల్ 9985419424.