At the Abids Cente beautiful “Taj” అబిడ్స్ సెంటర్లో అందాల ” తాజ్ ” !!

హైదరాబాద్ ముచ్చట్లు
* At the Abids Center… ..beautiful “Taj” *అబిడ్స్ సెంటర్లో…..అందాల ” తాజ్  ” !!

మీరు ఎన్నయినా చెప్పండి. హైదరాబాద్ లో ఎన్నిహోటళ్ళున్నా…  అబిడ్స్ ‘తాజ్ మహల్’ సంగతే వేరు. అక్కడి టిఫిన్…. ముఖ్యంగా బటన్ ఇడ్లీ, చిట్టి వడల్లో సాంబారు,వెన్న వేసుకొని తింటుంటే ఆ రుచే వేరబ్బా! అలాగే ఏసి ఛాంబర్ లో సౌత్ ఇండియన్ థాలీ భోజనం  ఎక్స్ట్రార్డినరీ గా వుంటుంది.ముఖ్యంగా అక్కడి తాజా చట్నీ, ఊరగాయలు ఇంట్లో తిన్నట్టే వుంటాయి.అందుకే ఎప్పుడైనా అటు వెళ్ళినపుడు తాజ్ దర్శనం తప్పని సరైపోయింది. అన్నట్టు పనిలో పనిగా అబిడ్స్ లో షాపింగ్ గట్రా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే అబిడ్స్ వైభవం తగ్గింది కానీ ఒకప్పుడు హొదరాబాద్ లో అబిడ్సే ప్రధానమైన షాపింగ్ సెంటర్..అది అబిడ్స్ కాదు..’ Habits ‘అనే నానుడి కూడా వుంది.కొత్త కొత్త ఫ్యాషన్లకు అబిడ్స్ కేంద్రంగా… వుండేది.ఇక బంగారు ఆభరణాలు,దుస్తులు ,చెప్పులు, స్కూళ్ళు,పుల్లారెడ్డి స్వీట్స్, రెస్టారెంట్లు, ఇతరత్రా వాటికి అబిడ్స్ కు రాక తప్పనిసరిగా వుండేది.ఇక పిల్లలకు నెహ్రూ బొమ్మను చూడటం అదో మోజు.

హైదరాబాద్ నగరం నడిబొడ్డులో వున్న తాజ్ హోటల్ కు ఆరుదశాబ్దాల(six decades ) అరుదైన చరిత్ర కూడా వుందండోయ్..! బాబురావు,ఆయన స్నేహితుడు ఆనందరావు ఈ హోటల్ ను ప్రారంభించారు.1942 లో వీరు ఉడిపి హోటల్ ను నిర్వహించే వారు .ఆ తర్వాత సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద అంబా భవన్ రెస్టారెంట్  ను తెరిచారు.1948 లో బాబురావు సోదరుడు సుందరరావు ను కలుపుకొని వీరు సికింద్రాబాద్ తాజ్మహల్ హోటల్ ను ప్రారంభించారు.మరో రెండేళ్ళకు అంటే…1950 ప్రాంతం లో అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ కు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సుందరరావు కుమారుడు చంద్రశేఖరరావు. తాజ్ గ్రూప్ హోటల్స్ ఛైర్మన్ గా వున్నారు.పాత తాజ్ ను కేవలం విడిది కోసం కేటాయించి,భోజనం, టిఫిన్ల కోసం పాత భవనం పక్కనే…కొత్త భవనం నిర్మించారు. అయితే పాత తాజ్ మాత్రం అబిడ్స్ లో హెరిటేజ్ భవనంగా పరిగణించబడుతుండటం విశేషం.

*సినీతారల హబ్…!!

తాజ్ మహల్ హోటల్ సినీ తారలకు హబ్ గా వుండేది. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసులో వున్నప్పుడు కూడా కథా చర్చలకు, తాజ్ హోటల్ కు వచ్చేవారు. ఆదుర్తి గారి మూగమనసులు సినిమా కథ.పాటల రచన, మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ తాజ్ గదుల్లో నే జరిగాయి. ఆదుర్తి, విశ్వనాన్, ముళ్ళపూడి వెంకటరమణ, ఆత్రేయ, నాగేశ్వరరావు, సావిత్రి ప్రభృతులు తాజ్ హోటల్ లో కధాచర్చల్లో పాల్గొన్నారు. ఇక ఆత్రేయ మూగమనసులు  కథ, మాటలు, పాటలు చాలావరకు ఇక్కడే రాశారు.ఈ సినిమాకు స్క్రీన్ ప్లేను ముళ్ళపూడి రాశారు. ఇదొక్కటే కాదు. ఇటుపక్క ఏ షూటింగ్ జరిగినా సినీతారలు అబిడ్స్ తాజ్ విడిది కావాలని కోరేవారట. మంచి సెంటర్. మంచి గదులు. అంతకు మించి మంచి భోజనం, అల్పాహారం, కమ్మని కాఫీ, టీలు దొరికే ఒన్ స్టాప్ హొటల్ గా తాజ్ ను అందరూ ఇష్టపడటంలో ఆశ్చర్యం లేదుకదా.!

*ఎ.రజాహుస్సేన్, రచయిత,  హైదరాబాద్

At the Abids Cente beautiful "Taj"/ zindhagi.com
Comments (0)
Add Comment