ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అరెస్ట్… రాత్రంతా వాహనంలో 300 కిలోమీటర్లు తిప్పిన పోలీసులు!

అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధాన్ని తీవ్రంగా ఖండిస్తూ, నేడు బీజేపీ పిలుపునిచ్చిన ‘ఛలో అంతర్వేది’కి అనుమతి నిరాకరించిన పోలీసులు నిన్న రాత్రి అమలాపురంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ఎస్ విష్ణు వర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఆయన్ను పోలీసు వాహనంలో రాత్రంతా తిప్పుతూ ఉన్నారు. తనను ఎక్కడికి తీసుకుని వెళుతున్నారని ఎంతగా ప్రశ్నించినా, పోలీసులు సమాధానం ఇవ్వడం లేదని, ప్రజలు శాంతియుతంగా తెలియజేయాలనుకుంటున్న నిరసనలను ప్రభుత్వం అడ్డుకుంటోందని, ఈ ఉదయం విష్ణువర్దన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

కాగా, చలో అమలాపురం నేపథ్యంలో ఎక్కడికక్కడ భారీగా మోహరించిన పోలీసులు, పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అమలాపురంలో దాదాపు 600 మంది పోలీసులు రాత్రి నుంచి పహారా కాస్తూ, సరిహద్దులను మూసివేసి, లోపలికి ఎవరూ వెళ్లకుండా చూస్తున్నారు. దీంతో పాటు తూర్పు గోదావరి జిల్లా కోనసీమను దిగ్బంధించారు. కొందరు నేతలు పోలీసుల కళ్లుగప్పి పట్టణంలోకి రాగా, వారిని అరెస్ట్ చేసి గుర్తు తెలియని ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది.

ముందస్తు చర్యలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సహా పలువురిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. మరోవైపు ఇదే కార్యక్రమానికి బయలుదేరిన విశాఖపట్నం బీజేపీ నేతలను కూడా నగరం శివార్లను కదలనీయకుండా చేశారు.ఈ క్రమంలో బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం ఎన్ని‌ అడ్డంకులు సృష్టించినాై అనుకున్న కార్యక్రమాన్ని జరిపి తీరుతామని సోము‌ వీర్రాజు స్పష్టం చేశారు.

ఈ ఉదయం ఇదే కార్యక్రమానికి బయలుదేరిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బీజేపీ నేతలు భూపతిరాజు శ్రీనివాస వర్మను, ఉంగుటూరులో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణిని, తాడేపల్లి గూడెంలో నరిసే సోమేశ్వరరావును, పోలవరంలో కరిబండి నాగరాజు తదితరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Tags: BJP, Vishnu Vardhan Reddy, Andhra Pradesh

https://twitter.com/ANI/status/1306803381361471488/

Andhra PradeshbjpVishnu Vardhan Reddy
Comments (0)
Add Comment