Amma philosophy
అమ్మ తత్వం
సత్యమంటే అమ్మ!!
బతుకు నడక తెలిపేది అమ్మ!!
సత్యమంటే అమ్మతత్వం…
ఓ సమగ్రమైన వ్యక్తిత్వం…
అమ్మ హృదయం ఒక ధర్మపథం!!
అమ్మ హృదయం ఆకాశమంత విశాలమైనది!!…
అమ్మ మనసు సాగరమంత లోతైనది!!
అమ్మ ప్రేమకోరితే వచ్చేది కాదు…
కాలం మారినా
కాలాతీతంగా నిలిచేది!!…
అమ్మను గురించి
మాటల్లో చెప్పేది కాదు…
మానవత్వమున్న ప్రతి ఒక్కరికీ
అమ్మప్రేమ కనిపిస్తుంది..
మనం పుట్టినప్పటి నుండి కడతేరేదాక మనసంతా నిలిచి ఉంటుంది!!…
మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది…
మానవీయ విలువలను పెంచుతుంది…
మనసుకు ఓ ప్రశాంతను కల్పిస్తుంది…
అమ్మతత్వం ఒక పరిధిలో
ఇమిడేది కాదు…
అమ్మ వ్యక్తిత్వం ఒకరు చెప్పేదికాదు!!…
మనసుకు మాత్రమే తెలిసేది…
జీవనయానంలో
మనకు తోడుగా నిలిచేది…
మనలోని మంచితనాన్ని
మేలుకొల్పేది!!…
అమ్మమీద భక్తి, ప్రేమ
సత్యమై నిత్యమై ఉండాలి!!…
అమ్మకు చేసే సేవే…
ముక్తికి మార్గం కావాలి!!…
అదే ఈ జీవితానికి నిలువెత్తు
భాగ్యమై నిలవాలి!!…
అమ్మ సత్యానికి నిలువెత్తు సాక్ష్యం!!…
ఆమె ఎవరూ కొలువలేని
లోతైన ఆర్ద్రత…
మాటలకు అందని మమకారం…
చూపులకందని విశాలహృదయం…
అమ్మప్రేమ ఓ ఊటచెలమ…
అమ్మ హృదయం అంతులేని అపూర్వమైన అనురాగనిలయం!!…
అమ్మను గురించి తెలియాలంటే
అంతర్మధనం జరగాలి!!…
అమ్మతనంలోని సత్యాన్ని చూడాలంటే
మూసుకుపోయిన మది తలుపులు తెరవాలి!!…
అమ్మప్రేమను పొందాలంటే
అమ్మ మనసును ఎరిగి నడుచుకోవాలి
అపురూపంగా చూసుకోవాలి!!…
అమ్మంటే సమస్తం…
సమస్త మహిళాలోకానికి ప్రతీక!!…
అమ్మతనాన్ని…
అర్థం చేసుకొని గౌరవించాలి!!…
ఈలోకంలో నిత్యమై సత్యమై
ఔనత్యమై ఉంటుంది!!…
ప్రతి స్త్రీ లోనూ అమ్మతనం అజరామరంగా
అంకురిస్తూనే ఉంటుంది!!…
(అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా..)
అంబటి నారాయణ
నిర్మల్, 9849326801