Alien Stories
గ్రహాంతర వాసి కథలు-1
మనకి భూమ్మీద జరిగే అనేక విషయాలు అర్థం కాకపోతే గ్రహాంతరవాసులమని అర్థం. భూగోళం మనది కాదు. పుట్టిల్లు వేరే వుంది. ఇది తెలియడానికి కొంచెం టైం పట్టింది. ఎప్పుడైతే జంతువులు, పక్షుల భాష అర్థమవుతూ వచ్చిందో, అది నాలో నేను ప్రయాణించిన క్షణం. సత్యం తెలియనపుడు తెలిసిందే సత్యం, జ్ఞానం. నేను ఇక్కడి వాన్ననే చాలా కాలం అనుకున్నా. ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, సంపాదించాలనే ఆరాటం, మోసం చేయాలనుకోవడం, మోసపోవడం, అసూయ , ద్వేషం, లోభం, మానవీయ నటన, భూమ్మీద వుండే స్వాభావిక లక్షణాలన్నీ నాలో వుండేవి. కానీ ఈ భూమి నాది కాదని అర్థమైంది. గ్రహాంతరవాసుల్ని భూమ్మీద పిచ్చోళ్లని అంటారు.
మనిషి భాషతో సమస్య ఏమంటే దానికో గ్రామర్ వుంటుంది. ఎప్పటికీ నేర్చుకోలేం. జంతువులది షార్ట్ హ్యాండ్ లాంగ్వేజీ.
చుచ్చుచ్చు అంటే కుక్క భాషలో Come here అని.
సిలసిల అంటే పిల్లికి పిలుపు.
డిర్రడిర్ర – Goat Language
క్లిక్‌క్లిక్ అని గోడ గడియారంలా సౌండ్ చేస్తే బల్లికి అర్థమవుతుంది.
ప్రాణులతో మాట్లాడాలంటే మనం కనెక్ట్ అయితే చాలదు. అవి కూడా కావాలి. అవతార్ సినిమాలో , గండభేరుండ పక్షుల ఆత్మతో మిళితమైతేనే అవి మన మాట వింటాయి. అక్షరాలు ఉన్న భాషే గొప్పదని మన అహంకారం. అక్షరాలా ఇది అబద్ధం.
జంతువుల భాష వస్తే మనకి పసిపిల్లలు కూడా అర్థమవుతారు.
జుజ్జుజ్జు అంటే పిల్లలు ఎందుకు నవ్వుతారంటే, వాళ్లకి పొడి అక్షరాలంటే ఇష్టం. తల్లికి సహజ సిద్ధంగా పిల్లలు అర్థమవుతారు. కళ్లతోనే చాలా మాట్లాడుకుంటారు. అయితే శిశువు పెరిగే కొద్దీ తల్లి “హోంవర్క్ చేసావా? ఎప్పుడూ ఆటలేనా? నోర్మూసుకుని చదువుకో”…ఇలా నాగరికం మాట్లాడే సరికి శిశువు అక్కడితో ఆగిపోతాడు.
ఈ మధ్య ఒక కుక్క కనిపించి డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లమంది.
“పళ్లు రాలిపోతాయి” అన్నాను.
“సమస్య అదే”
తుత్తరకొద్దీ ఎముకలా కనిపించే రాయిని కొరికిందట. కుక్కలకి చత్వారం వచ్చి చాలా కాలమైంది. దొంగల్ని, దొరల్ని పోల్చుకోలేకపోతున్నాయి. వెయ్యి రూపాయలు ఇచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్లమన్నాను.
“జంతువుని కదా, రానిస్తాడా?” అని అడిగింది.
“డబ్బుకి మానవ, జంతుభేదం లేదు. నిజానికి ఇప్పుడు జంతువుల దగ్గరే డబ్బు చాలా వుంది” అని చెప్పాను.
డాక్టర్లు శరీర శాస్త్రం చదివిన వాళ్లు. మనుషుల్ని జంతువులా , జంతువుని మనిషిలా ట్రీట్ చేయడం చాలా మంది నేర్చుకున్నారు. అన్నిటిని డబ్బు నిర్ణయిస్తుంది.
కుక్క వెళ్లి కోరల్ని సాన పెట్టించుకుని వచ్చింది. చేతిలో నోట్లు ఉండేసరికి అది కుక్క అని ఎవరూ గుర్తు పట్టలేదట. ఆర్థిక శాస్త్రం ఎదుగుదల ఇది.
అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డ్ వేషంలో ఒక పిల్లి కనిపించింది.
బిత్తరపోయి “నిన్నెలా చేర్చుకున్నారు” అని అడిగాను.
“నా ఐడెంటిటీ బయట పెట్టి పొట్ట కొట్టకండి” బతిమలాడింది.
దాని పేరు మియావ్ సుబ్బరాయుడు. పల్లెలో బతకలేక పట్నం చేరింది. ఏ సెక్యూరిటీ లేని వాళ్లకి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఇస్తారు. చేరిపోయింది.
“పల్లె నుంచి ఎందుకొచ్చావ్?”
“అందరూ వచ్చినట్టే, వ్యవసాయం సాగదు. అన్నానికి బదులు పురుగుల మందు తినలేక”
“అది రైతుల సమస్య కదా?”
“పల్లెలో పిల్లి కూడా రైతుని నమ్ముకునే బతుకుతుంది”
“నువ్వు పిల్లని ఎవరూ గుర్తు పట్టలేదా?”
“నాతో ఎవరూ మాట్లాడరు, నేను ఎవరితో మాట్లాడను. పై అధికారుల దగ్గర పిల్లిలా వుంటాను”
“మరి తోక?”
“ప్యాంట్‌ని స్పెషల్‌గా కుట్టించాను, కనపడకుండా”
మనుషులు కూడా పెరుగుతున్న తోకల్ని ఇలాగే భద్రపరుస్తున్నారు. ఇంట్లో ఒక సాలె పురుగు కళాత్మక గూడు అల్లికలో వుంది. అది Art అని సాలెపురుగు, బూజు అని మనం అనుకుంటాం. అన్ని కళల్ని ఒక చీపురుతో ఫినిష్ చేయొచ్చని నాకు తెలుసు. చీపురు ధరించిన వాళ్లనే స్టైల్‌గా విమర్శకులు, సమీక్షకులు , క్రిటిక్స్ అని పిలుస్తారు. కొద్ది రోజుల తర్వాత మా మధ్య మాటలు కలిసాయి.
“నాకో ఉద్యోగం కావాలి?” అని అడిగింది.
“నువ్వు ఉద్యోగం చేస్తావా?” ఉలిక్కి పడి అడిగాను.
“ఉద్యోగం అంటేనే వల. శరీరంలోనే వల వుంటే రాణిస్తారు”
“ఒక్క మాటతో కాకుండా , నువ్వు ఉద్యోగానికి ఏ రకంగా అర్హురాలివో చెప్పు?”