Again first the story of Amravati మళ్ళీ మొదటికి అమరావతి కథ

Again first the story of Amravati
మళ్ళీ మొదటికి అమరావతి కథ

ఎ.పి రాజధాని కథ మళ్ళీ మొదటికొచ్చింది..!!
ఆత్మ రక్షణలో ప్రతిపక్షాలు….!!

తగ్గేదేలే’.. దంటున్న సిఎం జగన్మోహన్ రెడ్డి..!!
మూడు రాజధానులకే మొగ్గు…??

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కథ మళ్ళీ మొదటి కొచ్చింది. ఇప్పటికే ఆమోదించిన మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకొని జగన్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఓ అడుగు వెనక్కు వేసింది. మూడు రాజధానుల బిల్లును రద్దుచేసి, సిఆర్డిఏను పునరుద్ధరించడం ద్వారా జగన్ ప్రభుత్వం రైతుల వ్యతిరేకత తలనొప్పిని తాత్కాలికంగా తగ్గించుకున్నట్లయిందిః. ప్రభుత్వం ఎలాగూ బిల్లును ఉపసంహరించుకుంది కాబట్టి న్యాయపరమైన చిక్కుల నుంచి కూడా దాదాపు బయటపడినట్లే భావించవచ్చు.

అమరావతికి వ్యతిరేకం కాదు…!!

తన ఇల్లు ఇక్కడే వుంది చెప్పడం ద్వారా అమరావతి ప్రాంతానికి తాను వ్యతిరేకిని కాదని చెప్పడం ద్వారాఈ ప్రాంత ప్రజల కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. మూడు రాజధానుల పట్ల రాష్ట్రంలోని ఒకటి, రెండు శాతం ప్రజలకు మాత్రమే వ్యతిరేకత వుందని, వారి అభ్యంతరాలను, అసంతృప్తిని పరిగణనలోకి తీసుకుని, సాంకేతికన్యాయ పరమైన చిక్కులు, సాంకేతిక లోపాలులేకుండామూడు రాజధానుల నిర్ణయంపై కొత్తగా ఓ సమగ్రమైన బిల్లును తేనున్నట్లు జగన్ ప్రకటించారు.దీంతో ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఒక్కటే రాజధాని అన్న విషయాన్ని ఇక మరిచి పోవాల్సిందేనని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. భవిష్యత్తులో వికేంద్రీకరణతో మూడు రాజధానుల ఏర్పాటు తప్పదని తేలిపోయింది..!!

తగ్గేదేలే…!!

మూడు రాజధానులు విషయంలో ‘ తగ్గేదేలే ‘ అన్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమ వైఖరిని కుండా బద్దలు కొట్టినట్లు చెప్పారు. నిజానికి జగన్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఇప్పుడు ప్రతి పక్షాలు అమరావతి మాత్రమే కావాలంటే వాళ్ళకు రాయలు సీమ, ఉత్తరాంధ్రలో ప్రజలు నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. మూడు రాజధానుల విషయంలో ఈ ప్రాంత ప్రజలనుంచి తమకు వ్యతిరేకంగా లేరని ఇటీవలి స్దానిక సంస్థలు ఎన్నికల ఫలితాలను బట్టి వైసిపి ఓ అవగాహనను వచ్చింది. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఎలాగూ తమకే మద్దతుగా వుంటారు కాబట్టి ఎలా చూసినా రాజకీయంగా తమకే లబ్ది చేకూరుతుందని వైసీపీ భావిస్తోంది..!!

ప్రతిపక్షాలేం చేస్తాయి..?

జగన్ ఓ రకంగా ప్రతిపక్షాలను ఇబ్బందుల్లోకి నెట్టారని చెప్పొచ్చు. తెలుగు దేశం, బిజెపి, జనసేన వచ్చే సాధారణ
అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా జనంలోకి వెళ్ళగలరా? అలా వెళితే వాళ్ళకు
సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల నుంచి మద్దతు లభిస్తుందా? అన్న విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం
లేదు.

కొత్త బిల్లు ఎప్పుడు?

జగన్ ప్రభుత్వం తెస్తామంటున్న మూడు రాజధానుల కొత్త(సమగ్ర) బిల్లు వెంటనే వచ్చే అవకాశంలేదు. రాజ
కీయ ప్రయోజనాలు దృష్ట్యా కొత్త బిల్లును తేవడంలో తాత్సారం తప్పనిసరి. మూడు రాజధానుల విషయమై ప్రజాభిప్రాయ సేకరణ, ప్రచారం వంటి మొక్కుబడి పనుల పేరుతో వచ్చే ఎన్నికల వరకు సాగతీత తప్పేట్టు లేదు. ఎన్నికల్లో మూడు రాజధానుల ఏర్పాటు ను ఎన్నికల ప్రాణాళికలో చేర్చడంద్వారా జనం అభిప్రాయాన్ని కూడ
గట్టి, ఆ తర్వాతే కొత్తబిల్లుకు వెళ్ళే అవకాశం వుంది. ఈ రెండేళ్ళు సాంకేతికంగా అమరావతే రాజధానిగా వుంటుంది. ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల కాన్సెప్ట్ తోనే ముందుకు పోతుంది. అప్పుడు అమరావతి అభివృద్ధి సహజంగానే ఎక్కడవున్న గొంగళి అక్కడే అన్నట్లు వుంటుంది. అనధికారికంగా విశాఖ ను భవిష్యత్ రాజ
ధానిగా అభివృద్ధి చేసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి లభిస్తుంది.

టీ కప్పులో తుపాను..!!

అమరావతి ఆందోళన టీ కప్పులో తుపానుగా మిగిలిపోతుంది. మూడురాజధానుల నిర్ణయం పై ప్రస్తుతానికి
బిల్లు ఏదీ లేకపోవడంతో రైతులు ఆందోళనతీవ్రత తగ్గి, పలచబడుతుంది. ప్రభుత్వం ఊపిరి పీల్చుకోవడానికి
అవకాశం దొరుకుతుంది. “కింద పడ్డా పై చేయి” అన్న సామెత ఇప్పుడు జగన్ విషయంలో నిజం కానుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే..!!

ఎ.రజాహుస్సేన్, రచయిత
విజయవాడ

Again first the story of Amravati/zindhagi.com / abdul rajahussen / yatakarla mallesh
Comments (0)
Add Comment