- పాన్ ఇండియా సినిమా అని కాకుండా.. ఇండియన్ సినిమా అని పిలవాలి
- లేదా ఏ భాషలో తెరకెక్కితే… ఆ భాషా చిత్రంగా పరిగణించాలి
- దేశమంతా చూసిన ‘రోజా’ చిత్రాన్ని పాన్ ఇండియా అని ఎవరూ పిలవలేదు
సినీ పరిశ్రమలో ఇప్పుడు పాన్ ఇండియా అనే పదం వాడకం ఎక్కువయింది. ఈ పదాన్ని వాడటంపై హీరో సిద్ధార్థ్ ఘాటుగా స్పందించారు. పాన్ ఇండియా సినిమా అని పిలవడం అగౌరవకరమని… దీని బదులు ఇండియన్ సినిమా అనడం చాలా గొప్పగా ఉంటుందని అన్నారు. మణిరత్నం ఎన్నో ఏళ్ల క్రితం తెరకెక్కించిన ‘రోజా’ చిత్రాన్ని దేశమంతా చూసిందని… దాన్ని ఎవరూ పాన్ ఇండియా మూవీ అని పిలవలేదని చెప్పారు. పాన్ ఇండియా అనేది ఒక నాన్సెన్స్ అని అన్నారు.
బాలీవుడ్ లో కాకుండా ప్రాంతీయ భాషా చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న సినిమాల గురించి వర్ణించేందుకే ఆ పదం ఉపయోగపడుతుందని సిద్ధార్థ్ చెప్పారు. బెంగళూరుకు చెందిన తన మిత్రులు యష్, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ సినిమా విషయంలో చాలా గర్వపడుతున్నానని అన్నారు. కన్నడ సినీ పరిశ్రమలో రూపొందిన భారతీయ సినిమా ఇదని చెప్పారు. ఏ సినిమానైనా భారతీయ సినిమాగానే పిలవాలని… లేదా ఏ భాషలో తెరకెక్కితే ఆ భాషా చిత్రంగా పరిగణించాలని సిద్ధార్థ్ అన్నారు.