A view of Meraj Fatima’s poem
మెరాజ్ ఫాతిమా…కవిత. ఓ వీక్షణ..!!
మాటలు…” నీటిమీద మూటలు ” కాకూడదు…!!
మాటలు..నీటిమూటలన్న సామెత ఊరికే రాలేదు. నోటి నుంచి వచ్చే ప్రతీ మాటకు విలువ వుంటుంది. పెదవి దాటితే పృథివి దాటుతుంది.అందుకే మన పెద్దలు ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఆచితూచి మాట్లాడ మనే వారు. మెచ్చులకో, మెర మెచ్చులకో ఎన్నో చెబుతుంటాము. ఆచరణకు వచ్చేసరికి వాటిలో ఒక్కటికూడా చేయము. అసలు మాట మీదే నిలబడం. రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందుఎన్నో వాగ్దానాలు చేస్తారు.అధికారం లోకి వచ్చాక వాటిని మరచిపోతారు. గుర్తున్నా లేదన్నట్లు నటిస్తారు.
కొందరు ఉంటారు.. ఆదర్శాల్ని వల్లెవేస్తుంటారు. తమదాకా వచ్చేసరికి చల్లగాజారుకుంటారు.
ఇంకొందరుంటారు. అపరహరిశ్చంద్రుల్లా మాట్లాడుతుంటారు. వాటిలో ఒక్కటికూడా నిజముండదు.
మెరాజ్ కవిత” నీటిమూటలు” చదివితే వీళ్ల బండారం బయటపడుతుంది. పెదవిపైనుంచి వచ్చే మాటలన్నీ నీటిమూటలని తేలి పోతుంది. మాటకుముందు కమిట్మెంట్ లేకపోతేమాటలన్నీ ఎలా నీటిమూటలవుతాయోమెరాజమ్మ చక్కగా చెప్పింది. ఆచరణకు నోచుకోని వేయి మాటలకన్నా ఆచరించే ఒక్క సూనృత మాట మేలు.ఈ కవిత చదవితే ఇకనుంచి మాట్లాడే ముందు మీరుకూడా ఓ సారి వెనుకా. ముందు ఆలోచిస్తారు.
నీటి మూటలు.!!
మాటల మాయల ఫకీరుల పిలకలో
బాల్యమెప్పుడూ పంజరాన బంధీయైన చిలకే,
ఎవడికో పిలలంటే ఇష్టమంట ,
ఇంకెవడికో బాల్యమంటే మక్కువంట .
ఎవడికో బీదలంటే దయంట,
ఇంకెవడికో బాదలంటే భయమంట,
.
ఆడపిల్లలంటే మక్కువంట,
అమ్మలంటే ఆదరణంట,
.
ఎక్కడి నుండి ఊడిపడ్దారు వీళ్ళంతా,
ఎందుకు ఈ. ఊకదంపుడంతా,
.
డొక్కలెండిన అనాథ బిడ్డలూ..,
ఉరికొయ్యకు ఊగే అన్నధాతలూ..,
కట్నానికి బలయ్యే అప్పచెల్లెళ్ళూ..,
ఫుట్పాత్ మీద ముడుచుకు పడుకున్న
ముసలోళ్ళూ..,
పాచి పని చేసే పసివాళ్లూ… ,
చెత్త ఏరుకొనే చిన్నారులూ..,
అడుగడుగునా ..అడుగులకడ్డం పడుతుంటే ,
సామాన్యుని సంసార చింత చితగ్గొడుతుంటే,
మాయల మయసభా పర్వం ముగిసేదెప్పడూ…..,
నీటి మూటలు వీపుమీద మోతలే ఎప్పడూ.(మెరాజ్)
చూశారుగా…!
ఇక మీదట మనం ఏం మాట్లాడినా అది నీటిమీద మూట కాకుండా చూసుకుందాం. జాగ్రత్తపడదాం!
థ్యాంక్యూ..మెరాజ్ ఫాతిమా…!!