A letter to this world ఈ లోకానికి ఓ లేఖ

A letter to this world
ఈ లోకానికి ఓ లేఖ

లోకానికి ఓ లేఖ!!…
నేను ఎక్కడ ఉన్నానో
నిజం తెలుసుకుంటా…
ఆత్మతో నా విన్నపాన్ని
అంతరాత్మతో విన్నవిస్తా…
నేను మాత్రం నీలోనే ఉన్నట్లు గుర్తు…
నా జ్ఞాపకాలన్నీ నీగుండెలోనే…
నా బాల్యం నుండి ఏరుకున్న
ప్రతి అనుభవాన్నీ జ్ఞాపకంగా
నా ఉదరంలోనే నిలుపుకున్నట్టు గుర్తు..

అందుకే.. కాలం కాగితమై
నా ముందు కొచ్చింది…
దాని మీదనే హృదయం విప్పి…

ఉపిరిని నిలిపి..సంఘర్షించి,సమీక్షించి
ఈ లేఖ..రాస్తున్నా!!…
ఈ లేఖలోనే మనుషుల స్వప్నాలను
మనసుతో ముడిపెట్టి…
సవాలక్ష సమస్యలతో కూడిన
కథల వెతల కవితలు రాస్తున్నా!!…

అప్పుడప్పుడు మనసు
కలుక్కుమంటుంది…
లోకంలోని కాకులగోల చూస్తుంటే…
అందరూ ఇంద్రజాలికులే అనిపిస్తుంది..
ప్రయత్నం లేకుండా
ఫలితము కావాలని చూస్తారు…
నింగివంగి కాళ్ళమీద పడాలంటారు…

ఈ లేఖ నిన్ను ఒప్పించలేక…
నా మనసులోని నిజాన్ని చూపించలేక..
నా గుండెకు సమాధానం చెప్పలేక..
సమస్యలు ఎత్తిపొడుస్తుంటే
ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఈలేఖ రాస్తున్నా
ఎన్ని ప్రమాదాలు పోటెత్తినా…
నాలోని తపన ఈలేఖ రాయిస్తుంది…

జన్మనిచ్చిన అమ్మ గుర్తుకొచ్చి…
నడక నేర్పిన నాన్న జ్ఞాపకం వచ్చి…
ప్రశ్నించుట నేర్పిన సమాజం యొక్క
ప్రేరణతో ఈ లేఖ రాస్తున్నా!!…
నిరంతరం తరంతరం నిలిచిపోవాలి…

ఈలోకానికి నావంతు బాధ్యతగా…
విశ్వాసంతో విషయాన్ని…
ఈ లేఖ ద్వారా వివరిస్తున్నా!!…
అధికారపు దాహంతో
కొందరు అంధులవుతున్నారు…
స్వార్థపరుల చేతిలో
కొందరు బలవుతున్నారు…
అడుగడుగునా అంతరాలు
సృష్టిస్తున్నారు…

అందుకే ఆ బడాచోర్ బద్మాసుల
పని పట్టడానికే ఈ లేఖ!!…
కొందరిని దురదృష్టం వెంబడిస్తుంది…
కొందరిని అదృష్టం వెంటబడి తరుముతుంది…
లోకమా…నీకడుపునిండా
అచంచల ఆలోచనల మలుపులే!!….
ఇన్ని మార్పులున్నా…
ఇంకా నీకు తెలియనివి ఎన్నెన్నో!!… మానవ ఇతిహాసాలను తెలిపే
విచిత్రచేష్టలు,విచిత్రదారులు మరెన్నో!!…

అంబటి నారాయణ
నిర్మల్, 9849326801

A letter to this world / zindhagi.com / yatakarla mallesh
Comments (0)
Add Comment