కుళ్ళు కుతంత్రం ఈర్ష్య జెలసీ కొనబడును

“మానవత్వాని కొనుక్కోండి”

ఇక్కడ సమాజపు సంతలో(అంగడి )
మానవత్వం అమ్మబడును
మీ ఆర్థికంలో లోటు రాకుండా అమ్మబడును
కుళ్ళు, కుతంత్రం, ఈర్ష్య, జెలసీ కొనబడును.
రండి..చక్కని అవకాశాన్ని అందుకోండి.
ఇవి సహజమైన నాణ్యమైన
విలువైన వస్తువులు..
ఈ విలువలు లేనివారు
తప్పకుండ కొనుక్కోవాలి..

తొందర పడండి
త్రోవ తప్పిన వారికి వెలుగునిస్తాయి
తరతరాలు అంతరాలలో
బంధించ బడిన..
మీమనసులో పేరుకుపోయిన..
కుళ్ళు కుతంత్రాలను మాకు అమ్మేయండి..
ఎంత ధరకైనా కొంటాం!!..

పసలేని వస్తువులు
మనస్తాపానికి గురిచేస్తాయి..
విశాలమైన సన్నిహిత భావాల్ని
అణగతొక్కుతాయి..
ఇవి చౌకబారు వస్తువులు
నిరూపయోగమైనవి..
అందుకే మాకు అమ్మేయండి!!..

మీ మానసికశక్తిని పెంచేది..
విలువల అంతస్తులను నిలిపేది..
కొత్త అనుబంధాలు
క్రొంగొత్త ఆత్మీయతలను కలిపేది..
విలువైన బతుకు కావాలంటే
కొత్తవెలుగైన జీవితం రావాలంటే
మానవీయతను కొనండి..

గుండెలో అలజడి పుట్టించేది..
పెనుతుపాను సృష్టించేది..
అందమైన ఊహల్ని తుంచేది..
అందంగా మీలో పులుముకున్న
అబద్దాల్ని అమ్మేయండి!!..

లక్ష్యాలను చేజిక్కించేవి..
పరమార్థాన్ని ప్రసాదించేది..
అపార్థాలను తొలిగించి
అపవాదాలను దూరం చేసేవి..
జిత్తులను ఎత్తులను అంతంచేస్తుంది..
నిస్వార్థాన్ని నిలుపుకోండి..
స్వార్థాన్ని అమ్మేయండి..

ప్రేమ కరుణ దయను దూరం చేసేవి..
కరుడు కట్టిన చెడును అమ్మండి..
ప్రేమ దయగల మంచితనాన్ని కొనండి..
కోట్లు పెట్టినా దొరకని విలువలు
మాటువేసి దొంగిలించాలన్నా అందనివి
అనంత శక్తికలిగిన కిరణాల కెరటాలు

విశ్వంలోనే శాశ్వతంగా నిలిచేవి
ప్రతివ్యక్తిలో విషయాన్ని
విజేతగా నిలిపేవి..
సర్వోత్తమునిగా నిలిపేది
సర్వహక్కులను కల్పించేది
సంకల్పబలాన్ని పెంచేది
సంకుచిత భావాలను తొలిగించేది
సంచిత స్థానాన్ని నిలిపేది
అసమాన భేధాలను హరించేది
అందరిపట్ల అభిమానం చూపించేది

మానవత్వం మానవీయతనే
అందరిలో ఉండాలి అందరిలో నిలవాలి
ఈ విలువలు లేకపోతే
సమూహంలోంచి విసిరేస్తారు..
కసురుకొని ఏకాకినిచేసి వేధిస్తారు
ఒంటరినిచేసి బాధించి తరిమేస్తారు
మీతో కొన్న వస్తువులన్నీ
మూటకట్టి హుసేన్ సాగర్ లో ఉన్న
బుద్ధుని ముందు ఉంచుతా..
ఆయన యోగదృష్టితో
పరిశీలించి చూస్తాడు
అన్ని విలువలు తెలిసిన వ్యక్తి
అందరిని పునీతులుగా చేస్తాడు..

అంబటి నారాయణ
నిర్మల్
9849326801

A lack of humanity in today's society
Comments (0)
Add Comment