మోదీ సంచలన ప్రకటన… వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్రం

భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యవసాయ చట్టాలపై ప్రజలకు నచ్చచెప్పేందుకు ఎంతో ప్రయత్నించామని అన్నారు. ఈ చట్టాలను కొందరు సమర్థించగా, మరికొందరు వ్యతిరేకించారని తెలిపారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతుల నుంచి వ్యతిరేకత వచ్చిందని… వారి కోరిక మేరకు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలను ఉపసంహరించుకుంటామని చెప్పారు.

మరోవైపు… పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తో పాటు ఉత్తర భారతంలో పలు రాష్ట్రాల్లో ఈ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీ శివార్లలో పంజాబ్ రైతులు ఏడాదికి పైగా నిరవధికంగా ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు గురునానక్ జయంతి సందర్భంగా మోదీ కీలక ప్రకటన చేయడం గమనార్హం. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో మోదీ నుంచి ప్రకటన వెలువడటం గమనించాల్సిన విషయం.

Comments (0)
Add Comment