- అప్పు అప్పు అంటూ నినాదాలు
- థియేటర్ల వద్ద క్రాకర్లు కాల్చి సందడి
- ఫస్టాఫ్ ఓ రేంజ్ లో ఉంటుందంటున్న అభిమానులు
అభిమానులు ‘అప్పు’ అంటూ ముద్దుగా పిలుచుకునే కన్నడ నటుడు, పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి యాక్షన్ థ్రిల్లర్ చిత్రం జేమ్స్ నేడు కర్ణాటక సహా దేశవ్యాప్తంగా విడుదలైంది. ‘రాజ్ కుమార్ కెరీర్ లోనే ఇది అత్యుత్తమ నటన’ ఇది అభిమానుల స్పందన. తొలి రోజే తమ అభిమాన నటుడ్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో థియేటర్ల వద్ద సందడి, కోలహల వాతావరణం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా 4,000 స్క్రీన్లపై సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు చేయడం తెలిసిందే.
పునీత్ రాజ్ కుమార్ జయంతి రోజే సినిమాను విడుదల చేశారు. అభిమానులు థియేటర్ల లోపల అప్పు యాక్షన్ సీన్లను చూసి కేరింతలతో సందడి చేస్తున్నారు. థియేటర్ల నుంచే తమ ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలపై వారు సినిమా పట్ల అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
సినిమా మొదటి భాగంలో ఇంటర్వెల్ పడే వరకు.. రాజ్ కుమార్ నటన ఓ రేంజ్ లో ఉంటుందని ఒక అభిమాని ట్విట్టర్ పై పోస్ట్ పెట్టాడు. యాక్షన్ సీన్లను చూస్తున్నప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొన్నాడు. మరో అభిమాని ఏకంగా థియేటర్ లోపల సందడిని వీడియో తీసి ట్విట్టర్ పై షేర్ చేశాడు. అప్పు అప్పు అనే నినాదాలతో థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు జరుపుకోవడం కూడా కనిపించింది.
ఈ సినిమాలో రాజ్ కుమార్ సరసన ప్రియా ఆనంద్ నటించింది. కథ, దర్శకత్వం చేతన్ కుమార్ అందించారు. కన్నడ, తెలుగు, హిందీ సహా ఐదు భాషల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. 1975 మార్చి 17న జన్మించిన రాజ్ కుమార్.. గుండెపోటుతో 2021 అక్టోబర్ 29న మరణించడం తెలిసిందే.