ఏపీకి ఫిక్సెడ్ రాజధాని అన్నది ఉండదా?

టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి స్థానే.. మూడు రాజధానుల ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాదనలు సైతం సబబుగానే కనిపిస్తాయి. ఇలాంటివేళ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం.. ఏపీ ప్రజలకు రానున్న రోజుల్లో రాజధాని అంటూ ఒకప్రాంతం పర్మినెంట్ గా ఉండదా? అన్న సందేహం కలుగక మానదు.

బాబు హయాంలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయటం.. ప్రధాని మోడీ శంకుస్థాపన చేయటం తెలిసిందే. గత ఏడాది అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు.. రాజధానిగా ఉన్న అమరావతిని శాసన రాజధానిగా పరిమితం చేస్తూ.. విశాఖ.. కర్నూలులో రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించటం తెలిసిందే. దీనిపై తాజాగా బాబు మాట్లాడుతూ.. రేపొద్దున మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాజధానిని నాలుగైదు ముక్కలు చేస్తానంటే ఏం చేస్తారు? అప్పుడు కూడా ప్రాంతాల మధ్య సమంగా డెవలప్ చేయటానికే అంటే ఏం మాట్లాడతారు? అంటూ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా.. రాజధానిని మారిస్తే.. రాష్ట్ర ప్రయోజనాలు ఏం కావాలి? అని ప్రశ్నించారు. రేపు మరో రాష్ట్రం తమ రాజధానిని నాలుగైదు ముక్కలుగా చేయాల్సి వస్తే పరిస్థితి ఏమిటన్న మాటను కేంద్రాన్ని ప్రశ్నించాలని తన ఎంపీలను కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం ఆడుతున్న మూడు ముక్కలాటను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.

బాబు మాటల్ని పరిగణలోకి తీసుకుంటే.. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు రాజధానుల్ని మార్చేలా నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏమిటి? అన్నది పెద్ద ప్రశ్న. ఇక.. ఏపీలో ఒకటిగా ఉన్న రాజధాని మూడుగా మారాయి. రేపొద్దున కొత్తగా వచ్చే మరో ప్రభుత్వం.. రాజధానిని మారుస్తూ నిర్ణయం తీసుకుంటే ఏం కావాలి? అదే జరిగితే.. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని శాపం ఉందన్న మాట నిజం కావటమే కాదు.. ఒక పెద్ద రాజధాని నగరం లేని లోటు ఏపీని వెంటాడుతూనే ఉంటుందని చెప్పక తప్పదు.
Tags: Amaravati, AP Capital, Chandrababu, 3 capitals, ysrcp party, telugudesam party

3 capitalsAmaravatiAP Capitalchandrababutelugudesam partyysrcp party
Comments (0)
Add Comment